తెలంగాణలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. అవసరాన్ని బట్టి మాత్రమే నియామకాలు జరగాలని అధికారులు గట్టిగా ఆదేశించారు. తాము ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని, అవసరాన్ని గుర్తించడం పూర్తిగా అధికారుల బాధ్యతేనని ఆయన సూటిగా తెలిపారు.
ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని విభిన్న శాఖల్లో ప్రస్తుతం ఎంతమంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు? ఆ నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతి ఉందా? వారిలో ఎంతమంది ఆధార్, బ్యాంక్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు? పని భారం ఎక్కువగా ఉన్న శాఖలు ఎక్కడ? నిజంగా అవసరం ఉన్న చోట ఎంతమంది కావాలి? వంటి అంశాలపై కమిటీ సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్ చర్యలు చేపట్టనుంది.
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టంగా పేర్కొన్నారు: “ఎవరినీ తొలగించాలని నేను చెప్పను, ఎవరినీ తప్పనిసరిగా తీసుకోవాలని కూడా కోరను. నిజంగా అవసరం ఉంటే, ఏ విభాగంలో అవసరమో మీరు ఖరారు చేయాలి” అన్నారు. గత ప్రభుత్వంలో అనుచితంగా నియామకాలు జరగడంతో అవినీతి పెరిగిందని ఆయన విమర్శించారు. కొన్నిచోట్ల అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల జీతాలు చెల్లించే పరిస్థితులు, మరికొన్ని చోట్ల జీతాలు జారీ చేసినా సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
ఉద్యోగుల నియామకాలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరుగాలని, ఆ బాధ్యత మొత్తాన్ని కమిటీ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
