శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న బంగరు తాపడంలో సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఈ వ్యవహా రంలో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే, పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

“ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం. దీనిపై కచ్చితంగా లోతైన విచారణ జరగాలి” అని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వాస్తవా నికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది.
ఈ వివాదంపై తీర్పునిచ్చిన ధర్మాసనం విచారణ బాధ్యతను విజిలెన్స్ కు అప్పగించాలని ఆదేశించింది. మూడు వారాల్లో పూర్తి వివరాల నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆలయంలో విలువైన సామాన్ల నిర్వహణలో తిరస్కరణలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. భక్తులు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆలయ సంపదకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని స్పష్టం చేసింది.
