సమాజంలో విభేదాలు రేకెత్తించే ప్రయత్నాలు ఇటీవల పెరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాల మధ్య దూరాలు సృష్టించే శక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక విభేదాలకు కారణమయ్యే ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులు, సభలు, సమావేశాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి శక్తులను ముందుగానే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మహిళల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించి ముందుకు సాగాలని సూచించారు. సుగాలి ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
సంక్షేమ హాస్టళ్ల వద్ద, ముఖ్యంగా బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరా పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ఆయన ఆదేశించారు. హాస్టళ్లలో జరుగుతున్న అక్రమాలు, నేరాలు వెలుగులోకి రావడానికి తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
